పాఠకులందరికీ శ్రీ మన్మథ నామ సంవత్సర శుభాకాంక్షలు. మన పూర్వీకులైన ఋషులచే కాలగణనం లో చూపిన చాంద్రమాన విధానము యందు చైత్ర శుద్ధ ప్రతిపది యుగాది (ఉగాది) పండుగ జరుపుకొనుట సాంప్రదాయము.
March 21 st ,2015 న శ్రీ మన్మథ నామ సంవత్సర యుగాది (ఉగాది ) పండుగ జరుపుకోదగినది .యుగాది పండుగ నాడు ప్రాతఃకాలము నందు తైలాభ్యంగన స్నానము ఆచరింప వలెను .వేప పువ్వు , చింతపండు , మొదలగు ఆరు రుచులతొ కూడిన ఉగాది పచ్చడి భగవత్పూజ ఆచరించి, నివేదన చేసి తినవలెను .పిమ్మట నూతన సంవత్సర పంచాంగ శ్రవణం చేసి పరమాత్ముని చే నియమింపబడిన కాలస్వరూపమున, ఈ సంవత్సరమున జరుగు విశేషములను , రాజాది నిర్ణయమును ,కందాయ ఫలములను, ఆదరముగా తెలుసుకొనవలెను . ఉగాది పండుగ నాడు ద్విజులకు ఉదకకుంభమును (నీటిచెంబును ) దానము చేయుట సనాతన సాంప్రదాయము నందు భాగము .
||శ్లో|| ఏష ధర్మ ఘటో దత్తో బ్రహ్మ విష్ణు శివాత్మకః |
అస్య ప్రధానాత్సకలాః మమ సంతు మనోరథాః ||
పైన శ్లోకమును పఠించి ఉదకకుంభ దానమాచరించిన , సకల మనోభీష్టములు నెరవేరును .ఇట్లు ఆచరించిన వారు సంవత్సరమంతయూ సుఖశాంతులతో జయప్రదము గా నుండెదరని నారదాది మునీంద్రులచే చెప్పబదినది .
ఉగాది పండుగ నాడు పాలు ,పెరుగు, నెయ్యి తినుట మాని నిష్టగా గౌరీ వ్రతము ఆచరించుట సాంప్రదాయము గా ఉన్నది. ఉగాది నాటి నుండి వసంత నవరాత్రులు ప్రారంభమగును .శ్రీరామనవమి నాటికి ఈ నవరాత్రులు పూర్తియగును. చాంద్రమాన నూతన సంవత్సరాదిన (ఉగాది రోజున) ఇట్లు ఎవరైతే ఆచార నియమములు పాటించెదరో ,అట్టి వారు సంవత్సరమంతయూ సకల భోగభాగ్యములు కలిగి, సుఖ శాంతులతో వర్ధిల్లెదరని నారద సంహిత యందు మునీంద్రుల మతము .
నూతన సంవత్సర శుభాకాంక్షల తో ,
శుభాస్తే పంథానస్సంతు